మేం అడుగుపెడితే అల్లకల్లోలమే : చైనా

Header Banner

మేం అడుగుపెడితే అల్లకల్లోలమే : చైనా

  Tue Aug 22, 2017 21:13        India, Telugu

చైనా మళ్లీ భారత్‌పై విషం చిమ్మింది. బెదరింపుల స్థాయిని పెంచింది. మాకు మేమే సాటన్న ధోరణిలో మరోసారి భారత్‌పై నోరు పారేసుకుంది. మేము భారత భూభాగంలోకి అడుగుపెడితే 'అంతా అల్లకల్లోలమే' అంటూ హెచ్చరించింది. భారత సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు చైనాకు ముప్పుగా పరిణమించాయన్న మిషతో తమ బలగాలు భారత భూభాగంలోకి వస్తే పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా మారుతుందని బీజింగ్ తెగేసి చెప్పింది. డోక్లాంలో రోడ్డు నిర్మాణం న్యూఢిల్లీకి ముప్పుగా పరిణమించనుందంటూ భారత్ చేస్తున్న వాదనలు హాస్యాస్పదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. చైనా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎంతమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంది. 'చైనా సరిహద్దులు దాటి రోడ్డు నిర్మాణం చేపడుతోందంటూ భారత బలగాలు అక్రమంగా మా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వారి వాదనలో ఏమాత్రం పసలేదు. వాస్తవాలు చాలా స్పష్టంగా ఉన్నాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హూ చున్యింగ్ అన్నారు. 'ఇండియా హాస్యాస్పదమైన వాదన చేస్తోంది. పొరుగున ఉన్న వ్యక్తి సొంతింట్లో పని చేసుకుంటుంటే అది నచ్చలేదంటూ ఆ ఇంట్లో చొరబడితే ఏమనాలి? చైనా కూడా అలాగే ఆలోచించి సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరగడం తమ ప్రాంతానికి ముప్పుగా పరిగణించి భారత భూభాగంలోకి అడుగుపెట్టొచ్చా? అది తీవ్ర గందరగోళానికి దారితీయదా?' అని చున్యింగ్ ప్రశ్నించింది.

రాజ్‌నాథ్‌జీ....మేమూ శాంతే కోరుతున్నాం కానీ....
తమ దేశం శాంతినే కోరుకుంటోందని, చైనా కూడా ఆ దిశగా తగిన పరిష్కారం కనుగొంటుందని ఆశిస్తున్నామని భారత హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై హూ చున్యింగ్ స్పందించారు. చైనా కూడా శాంతినే కోరుకుంటోందని, శాంతిని పాదుకొలుపేందుకు కట్టుబటి ఉందని అన్నారు. అదే సమయంలో తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు వెనుదీయదని చెప్పారు. ఇందుకు ఏ దేశం కూడా తమకు మినహాయింపు కాదని అన్నారు. డోక్లాం సమస్య పరిష్కారం కావాలంటే భారత బలగాలు వెనక్కి వెళ్లాల్సిందేనని చున్యింగ్ స్పష్టం చేసింది.   మేం అడుగుపెడితే అల్లకల్లోలమే : చైనా