సుప్రీం తీర్పును స్వాగతించిన ఐద్వా

Header Banner

సుప్రీం తీర్పును స్వాగతించిన ఐద్వా

  Tue Aug 22, 2017 20:30        India, Telugu

ట్రిపుల్‌ తలాక్‌ ఏకపక్షమని, చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని ఐద్వా స్వాగతించింది. ఏకపక్షమైన, నిర్బంధమైన, తిరస్కరించడానికి వీలులేని, తొందరపాటుగా జరిగే ట్రిపుల్‌ తలాక్‌ను తాము మొదటినుంచి వ్యతిరేకిస్తున్నట్లు ఐద్వా తెలిపింది. లక్షలాది మంది ముస్లిం మహిళలు ట్రిపుల్‌ తలాక్‌తో కష్టాలు పడుతున్నారని పేర్కొంది. ట్రిపుల్‌ తలాక్‌తో ఆర్థికంగానూ, ఎలాంటి ఇతర సహాయం లేకుండా ముస్లిం మహిళలు వదిలివేయబడతారని, ఎస్‌ఎంఎస్‌, స్కైప్‌.. వంటి పద్ధతుల్లోనూ ట్రిపుల్‌ తలాక్‌ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అనేక ట్రిపుల్‌ తలాక్‌ కేసులపై ఐద్వా లీగల్‌ సెల్‌ పోరాటం చేసిందని, బాధిత మహిళలకు అండగా నిలబడిందని తెలిపింది. ఖురాన్‌ ప్రాథమిక సిద్ధాంతాలను, షరియత్‌ విలువలను ట్రిపుల్‌ తలాక్‌ ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ పేర్కొనడాన్ని ఐద్వా ప్రశంసించింది. జస్టిస్‌ జోసెఫ్‌తో పాటు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నరిమాన్‌, జస్టిస్‌ యుయు లలిత్‌ కూడా ట్రిపుల్‌ తలాక్‌ అనేది ఇస్లాంలో భాగం కాదని, పాపమని పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌, అబ్దుల్‌ నజీర్‌ అభిప్రాయాలను ఐద్వా అంగీకరించలేదు. ట్రిపుల్‌ తలాక్‌పై ఆరు నెలల నిషేధం విధిస్తూ, పార్లమెంట్‌లో చట్టం చేయాలని ధర్మాసనం సూచించింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌర సృతి తేవాలని ప్రయత్నిస్తోందని, లింగ సమానత్వం, మత విశ్వాస్వాలను పట్టించుకోవడం లేదని ఐద్వా ఆరోపించింది. ట్రిపుల్‌ తలాక్‌పై తీర్పును క్షుణంగా పరిశీలించిన అనంతరం పూర్తిస్థాయిలో స్పందిస్తామని ఐద్వా పేర్కొంది.   సుప్రీం తీర్పును స్వాగతించిన ఐద్వా