అభద్రతా భావం ఓ రాజకీయ ప్రచారమే : వెంకయ్య నాయుడు

Header Banner

అభద్రతా భావం ఓ రాజకీయ ప్రచారమే : వెంకయ్య నాయుడు

  Thu Aug 10, 2017 20:14        India, Telugu

 ‘‘మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారని కొందరు అంటున్నారు. ఇదంతా రాజకీయ ప్రచారం. యావత్తు ప్రపంచంతో పోల్చినపుడు, మైనారిటీలు భారతదేశంలో అత్యంత సురక్షితంగా, భద్రతతో ఉన్నారు, వారికి అందవలసినది వారు పొందుతున్నారు’’ అని కాబోయే ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. 
 
 
దేశంలో అసహనం పెరుగుతోందన్న అభిప్రాయంతో వెంకయ్య నాయుడు ఏకీభవించలేదు. భారతీయ సమాజం ప్రపంచంలోనే అత్యంత సహనశీలమైనదని, దీనికి కారణం భారతీయులు, భారతీయ నాగరికత అని వివరించారు. సహనం ఉండటం వల్లే ప్రజాస్వామ్యం విజయవంతమైందని తెలిపారు.
 
పదవీ విరమణ చేయబోతున్న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ టీవీకి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దీనిపై ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు వెంకయ్య నాయుడు సమాధానం చెప్పారు. అయితే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలను చేసేటపుడు ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు.
 
ఓ సముదాయాన్ని (కమ్యూనిటీని) ప్రత్యేకంగా చూపించడం వల్ల మిగతా సముదాయాలు మరోవిధంగా పరిగణిస్తాయని వెంకయ్య నాయుడు అన్నారు. అందుకే తాము మనమంతా సమానమేనని చెప్తున్నామని స్పష్టం చేశారు. ‘ఎవరినీ బుజ్జగించేది లేదు, అందరికీ న్యాయం జరగాలి’ అనేది తమ నినాదమని చెప్పారు. మైనారిటీలపై వివక్ష లేదని చరిత్ర రుజువు చేస్తోందన్నారు. మైనారిటీలపై వివక్ష లేకపోవడం వల్ల, వారి ప్రతిభ ఆధారంగా అతి ముఖ్యమైన పదవులతోపాటు రాజ్యాంగ పదవులను కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు.


   అభద్రతా భావం ఓ రాజకీయ ప్రచారమే : వెంకయ్య నాయుడు