అమెరికా లోని శాక్రమెంటో తెలుగు సంఘం స్థానిక సాయి సేవా సదన్ సహకారంతో నిర్వహించిన "ఆదిత్య ఆరాధన, ఆయురారోగ్య సాధన”.. ప్రవచనం తో భక్తులను ఆకట్టుకున్న సామవేదం షణ్ముఖ శర్మ

Header Banner

అమెరికా లోని శాక్రమెంటో తెలుగు సంఘం స్థానిక సాయి సేవా సదన్ సహకారంతో నిర్వహించిన "ఆదిత్య ఆరాధన, ఆయురారోగ్య సాధన”.. ప్రవచనం తో భక్తులను ఆకట్టుకున్న సామవేదం షణ్ముఖ శర్మ

  Wed Jul 26, 2017 12:25        Associations, Devotional, India, Telugu, World

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న  శాక్రమెంటో శివారు నగరం రాంచో కార్డోవ  లో సోమవారం జులై   24, 2017 న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్)  స్థానిక సాయి సేవా సదన్ సహకారంతో  నిర్వహించిన "ఆదిత్య ఆరాధన, ఆయురారోగ్య సాధన” ప్రవచనం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పండితులుగా, అనేక విషయాలపై పట్టు ఉన్న విజ్ఞాన ఘనిగా, ఆధ్యాత్మిక వేత్తగా వినుతి కెక్కిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం  చేసారు. చాలా సరళమైన మాటలతో భక్తులకు సూర్య దేవుని ఆరాధనతో జ్ఞానం, ఆరోగ్యం, సంపద తో పాటు మనకు కలిగే  పలు ప్రయోజనాలు ఆయన చెప్పారు.

తూర్పున ఉదయించే సూర్యునితో  దిక్కులను కనుగొనడంలో మానవ ప్రయత్నం మొదలవుతుంది అని ఆయన చెప్పారు. సూర్యుడికి ఉన్న పలు నామాలను ఆయన చెప్పారు. తన ఆరాధన తో ద్రౌపదిని అనుగ్రహించి, ఆమెను  రక్షించడానికి సూర్యుడు పంపిన శక్తి గణాలు కీచకుడిని ఎలా విసిరి కొట్టాయో చెప్పారు. మాయతో రక్తమోడుతున్న  రాముడు, లక్షణుడి తలలు సృష్టించి  సీతను రావణుడు భయపెట్టే ప్రయత్నంలో, సీత సూర్య దేవుని ఆరాధనతో ఎలా ఉపశమనం పొందినదో ఆయన వివరించారు. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకు మూర్ఛపోయి, కింద పడిపోయిన బాల హనుమంతుడు కి సూర్యుడు తన తేజంలో  ఒక వంతు ధారపొయ్యడం, పిదప బాల హనుమంతుడు, సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు ఒక కాలు, అస్తమించే పడమర దిక్కు మరో కాలు వేసి నిత్యం పయనించే సూర్యుని వద్దనుండి వేద విద్యలు నేర్చుకున్న విషయం సోదాహరణంగా వివరించారు. అప్పటికే వేద విద్యలలో పరిపూర్ణత సాధించిన రాముడు, మొదటి పరిచయం లోనే హనుమంతుడికి సూర్యుని మూలంగా అబ్భిన  వేద జ్ఞానం అసమాన్యం అయినదని గ్రహించాడని ఆయన చెప్పారు. రోజూ పుష్కలంగా బంగారం ప్రసాదించే శమంతక మణిని సత్రాజిత్తు ఆదిత్య ఆరాధన తోనే పొందగలిగాడని చెప్పారు. అయితే మీరు ఆదిత్య ఆరాధన తో బంగారం వంటి ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఆయన చెప్పారు. ముఖ్యంగా సూర్యుడిని ఆరాధిస్తే కంటి, చర్మ సంబంధ వ్యాధులనుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని చెప్పారు.

యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో తన గురువైన వైశంపాయనునితో వాదానికి  దిగి గురువు ఇచ్చిన శాపంతో గురువు తన నుండి ఆర్జించిన పూర్తిగా కోల్పోయి పిదప సూర్యుని ప్రార్థించి యజుర్వేద మంత్రాలకు సంబంధించిన  జ్ఞానాన్ని, శుక్ల యజుర్వేదానికి (వైజస్ణేయి సంహితం) సంబంధించిన  సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడని షణ్ముఖ శర్మ వివరించారు. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశించాడు, ఈ మంత్రోపదేశము అయిన తరువాతనే  శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేసాడు అని ఆయన చెప్పారు. చిత్ సూర్యుడు ప్రతి మానవుడిలో ఉంటాడని, సూర్య భగవానుడి సాధనతో, ఉపాసనతో భగవత్ దర్శనం సాధ్యమవుతుంది అని ఆయన చెప్పారు. సూర్యుని వెలుగువల్లే భూమిపై జీవులు జీవిస్తున్నాయి, దైవాన్నిచూపించండి .. అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చునని, సూర్యుడిలో దైవం ఉన్నదనడం పరమ సత్యమని ఆయన చెప్పారు. ఇవే కాకుండా సూర్య కిరణాలపై  కొన్ని ముఖ్యమైన లోతైన శాస్త్రీయ విషయాలు కూడా విశదీకరించారు. కాంతి కిరణాల ఉష్ణ తీవ్రతని బట్టి వాటన్నిటికీ వేరు వేరు పేర్లు ఉన్నట్లుగా ఆసక్తి కరమైన విషయాలు వివరించారు.

భోగం రోగాలవైపు తీసుకెళితే, యోగం జ్ఞానం వైపు కు తీసుకెళుతుంది, అందుకనే ఋషులు యోగం వైపుకు వెళ్లి అనంత వేద సంపాదనను జాతికి అందించారని చెప్పారు. వేదాలలో అపార జ్ఞానం ఉందని, దాన్ని  యువత  అందిపుచ్చుకొంటే మెరుగైన సమాజం సాధ్యమని ఆయన చెప్పారు. శాపవశాత్తు కుష్ఠురోగి  గా మారిన సాంబుడు, తన తండ్రి కృష్ణుడి  సూచన మేరకు రోగ విముక్తి పొందేందుకై కాశీనగరానికి వెళ్ళీ, సూర్యుని ఆరాధించి, తన  అనారోగ్యమును  సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడని, ఇది అతి శక్తివంతమైన స్తోత్రము అని షణ్ముఖ శర్మ  చెప్పారు,  ఆ సూర్యస్తోత్రము లోని 12 శ్లోకాలను పఠించి  తన ప్రవచన కార్యక్రమాన్ని ముగించారు.

ముందుగా టాగ్స్ ఆధ్యాత్మిక అవగాహన కమిటి నాయకుడు వీర్రాజు విన్నకోట,  సామవేదం షణ్ముఖ శర్మ ను సభకు పరిచయం చేశారు.   సనాతన ధర్మ విలువలను, వైశిష్ట్యాలను చాటి చెప్పడం, ఆధ్యాత్మిక ప్రభోధనలే గాక, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలుఅందించడం, వివిధ భారతీయ కళలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలు అందచేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గోసంరక్షణాబాధ్యతలు చేపట్టడం అనే విషయాలే ధ్యేయంగా ఋషిపీఠం అనే ధార్మిక సంస్థ ద్వారా షణ్ముఖ శర్మ దశాబ్దాలుగా  సామాజిక సేవ చేస్తున్నారని వీర్రాజు విన్నకోట చెప్పారు.

ప్రవచనం కార్యక్రమం లో భాగంగా  శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు సామవేదం షణ్ముఖ శర్మ ను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. శాక్రమెంటో తెలుగు సంఘం, స్థానిక సాయి సేవా సదన్ సహకారంతో ఏర్పాటు చేసిన  "ప్రవచనం”  కార్యక్రమంలో  షణ్ముఖ శర్మ ను ప్రత్యక్షంగా చూడడం, ఆయన ప్రవచనం వినడం  తమకు  దివ్యానుభూతి కలిగించింది అని పలువురు భక్తులు చెప్పారు.

ఈ సందర్భంగా , తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నివాసముండే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు 2003 ‌లో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) స్థాపించడం జరిగిందని ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. ఈ స్థానిక సంస్థ తెలుగువారికి అండగా ఉంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగిందని వారు పేర్కొన్నారు. షణ్ముఖ శర్మ శాక్రమెంటో పర్యటన కు విశేష కృషిచేసిన  వీర్రాజు విన్నకోట, వెంకటేష్ రాచపూడి, కార్యక్రమ ఏర్పాట్లను చేసిన స్థానిక సాయి సేవా సదన్ కార్యకర్తలకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  కాలిఫోర్నియా శాక్రమెంటో లో “ప్రవచనం” కార్యక్రమం  విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి,  డా సంజయ్ యడ్లపల్లి మరియు పలువురు  టాగ్స్ కార్యకర్తలు పాల్గోన్నారు. స్థానిక భక్తులు అందించిన ప్రసాదం  అందరినీ అలరించింది. “ప్రచనం” కార్యక్రమం ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream  లో లేదా https://goo.gl/PKeTgb లో చూడవచ్చునని వారు తెలిపారు. ఫణి డోగిపర్తి  ఫోటోగ్రఫీ సహకారం అందించారు.  టాగ్స్ అధ్యక్షులు మనోహర్ మందడి చేసిన వందన సమర్పణ తో కార్యక్రమం విజయవంతం గా ముగిసింది.  టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు

కోరారు.   అమెరికా లోని శాక్రమెంటో తెలుగు సంఘం స్థానిక సాయి సేవా సదన్ సహకారంతో నిర్వహించిన "ఆదిత్య ఆరాధన, ఆయురారోగ్య సాధన”.. ప్రవచనం తో భక్తులను ఆకట్టుకున్న సామవేదం షణ్ముఖ శర్మ