జరిమానా కడతా.. జుట్టు మాత్రం కత్తిరించను

Header Banner

జరిమానా కడతా.. జుట్టు మాత్రం కత్తిరించను

  Tue Jul 25, 2017 22:32        India, Sports, Telugu

భారత క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ తన పొడవాటి జట్టు కారణంగా చోటు చేసుకున్న కొన్ని సరదా సన్నివేశాలను తాజాగా ఓ టీవీ కార్యక్రమం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 2007లో దక్షిణాఫ్రికాతో ఆడేందుకు ఎంచుకున్న భారత జట్టులో ఇషాంత్‌ చోటు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ఇషాంత్‌ ప్రత్యేక కేశాలంకరణతో దర్శనమిస్తూనే ఉన్నాడు.

ఇషాంత్‌కి చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడమంటే ఇష్టం. ఈ నేపథ్యంలో అతను ఓసారి తన పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఆగ్రహానికి గురయ్యాడట. అది ఎలాగో అతని మాటల్లోనే... ‘ఆ సమయంలో నేను అండర్‌-19 క్రికెట్‌ జట్టులో ఆడుతున్నాను. ఓ సారి పాఠశాల అసెంబ్లీ జరుగుతోంది. అందరం హాజరయ్యాం. సరిగ్గా అప్పుడే మా పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ వచ్చి... పొడవాటి జట్టు ఉన్నవాళ్లను ముందుకు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. సైలెంట్‌గా నిల్చున్నాను. అందరి కంటే ఎత్తుగా ఉండటం వలన వైస్‌ ప్రిన్సిపల్‌ కంట పడ్డాను. ఇంకేముంది అతను రమ్మంటే రాలేదని ఆగ్రహంతో నా జట్టును పట్టుకుని అసెంబ్లీ నుంచి బయటికి లాక్కొచ్చాడు. అయినప్పటికీ నేను నా జట్టును కత్తిరించుకోలేదు’ అని ఇషాంత్‌ తెలిపాడు.

‘అలాగే మరోసారి అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టులో ఆడే సమయంలో అప్పటి కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సమయంలో లాల్‌చంద్‌ సార్‌ నా దగ్గరికి వచ్చి ఇషాంత్‌ నీ ఫ్యాషన్‌కు ఇక్కడితో స్వస్తి పలుకు. ఇక్కడ నువ్వు ఏమీ మోడల్‌ కాదు. జట్టును కత్తిరించు. లేకపోతే 100 డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఫైన్‌ కట్టేందుకు డబ్బులు తీసుకుని వెళ్లా అంతేకానీ నా జట్టు మాత్రం కత్తిరించలేదు’ అని ఇషాంత్‌ తెలిపాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇషాంత్‌... బుధవారం భారత్‌-శ్రీలంక మధ్య జరిగే తొలి టెస్టులో తన పొడవాటి కేశాలతో మరోసారి అభిమానులను అలరించనున్నాడు.   జరిమానా కడతా.. జుట్టు మాత్రం కత్తిరించను