‘సూపర్’ శ్రీకాంత్

Header Banner

‘సూపర్’ శ్రీకాంత్

  Mon Jun 26, 2017 21:26        India, Sports, Telugu

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌ను భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో రెండు పర్యాయాలు ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ప్రపంచ ఆరో ర్యాంకర్ చెన్ లాంగ్‌ను 22-20, 21-16 తేడాతో ఓడించాడు. ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్న ఈ తెలుగు తేజం తన కంటే మెరుగైన స్థానంలో కొనసాగుతున్న చెన్ లాంగ్‌ను కేవలం 45 నిమిషాల్లో, వరుస సెట్లలో చిత్తుచేయడం విశేషం. గత వారం ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించిన శ్రీకాంత్ వరుసగా మరో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు అతను ఇండోనేషియా సూపర్ సిరీస్‌లోనూ ఫైనల్ చేరాడు. ఈ విధంగా మూడు వరుస సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్ చేరిన ఐదో ఆటగాడిగా, తొలి భారతీయుడిగా అతను రికార్డు నెలకొల్పాడు. తుది పోరు ఆరంభంలో చెన్ లాంగ్ నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ సర్వశక్తులు ఒడ్డి పోరాడిన శ్రీకాంత్ దానిని సాధించిన వెంటనే, రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ ఆడాడు. చెన్ లాంగ్‌ను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టేసి, విజేతగా నిలిచాడు.
మహిళల విజేత ఒకుహరా
మహిళల సింగిల్స్‌ను జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరా గెల్చుకుంది. ఫైనల్‌లో ఆమె తన దేశానికే చెందిన అకానే యమాగూచీని 21-12, 21-23, 21-17 తేడాతో ఓడించింది. పురుషుల డబుల్స్‌లో హెండ్రా సెతియవాన్, తాన్ బూన్ హియాంగ్ జోడీని 21-17, 21-19 స్కోరుతో ఓడించిన తకెషి కమురా, కియో సొనొదా జోడీ టైటిల్ అందుకుంది. మహిళల డబుల్స్‌లో మిసాకీ మత్సుతొమో, అయాకా తకహషి 21-10, 21-13 ఆధిక్యంతో కమిల్లా రైటర్ జుల్, క్రిస్టియానా పెడెర్సెన్ జోడీని ఓడించి టైటిల్ సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జెంగ్ సివెయ్, చెన్ క్వింగ్‌చెన్ జోడీకి టైటిల్ లభించింది. వీరు ఫైనల్‌లో ప్రవీణ్ జోర్డాన్, డెబ్బీ సుసాంతో జోడీని 18-21, 21-14, 21-17 తేడాతో ఓడించారు.
*
‘ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేందుకు సిడ్నీ చేరుకున్నప్పుడు నేను ఆనారోగ్యంతో బాధపడ్డాను. డీహైడ్రేషన్ కారణంగా నీరసపడిపోయాను. దీనితో ఫిట్నెస్ కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. పైగా, ఇక్కడి వాతావరణంలో దూకుడుగా ఆడేందుకు వీల్లేకపోయింది. షటిల్ నింపాదిగా కదలడంతో ప్రతి పాయింట్‌కూ చెమటోడ్చక తప్పలేదు. టైటిల్ గెలిచిన తర్వాత శ్రమను మరచిపోయాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’.

చిత్రం.. శ్రీకాంత్   ‘సూపర్’ శ్రీకాంత్