అమరావతిలో నేడే ఐటీ జోష్‌!

Header Banner

అమరావతిలో నేడే ఐటీ జోష్‌!

  Wed May 03, 2017 22:31        APNRT, India, Telugu

  •  కేసరపల్లి ‘మేధ’లో ఏపీఎన్ఆర్‌టీ ఐటీ కన్సార్టియం
  •  తరలి వచ్చిన ఏడు విదేశీ కంపెనీలు
  •  ఐటీ మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభం
  •  త్వరలో 1,600 మందికి ఉద్యోగాల కల్పన
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
గత పదేళ్లుగా ఐటీ వెలుగులకు దూరంగా ఉంటున్న కేసరపల్లిలోని ఎల్‌అండ్‌టీ-ఏపీఐఐసీ ఐటీ పార్క్‌ నేడు ద్విగుణీకృతం కానుంది. ఐటీ పార్కులోని ‘మేధ’ టవర్‌లోకి ఏపీఎనఆర్‌టీ కన్సార్టియంతో కూడిన ఏడు విదేశీ, స్వదేశీ ఐటీకంపెనీలు తరలి వచ్చాయి. రాజధాని ప్రాంతంలోని యువతకు ఐటీ కలల సాకారానికి కంపెనీల శ్రేణి ముందుకు వచ్చింది. బుధవారం ఉదయం ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. విజయవాడ ఆటోనగర్‌లో ఐటీ కంపెనీల శ్రేణి ఇప్పటికే వచ్చింది. తాజాగా మేధ టవర్‌లోకి మరిన్ని కంపెనీలు వస్తున్నాయి. గన్నవరంలోని విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎదురుగా కేసరపల్లిలోని ఎల్‌అండ్‌టీ-ఏపీఐఐసీ ‘మేధ’ ఐటీ పార్క్‌లో ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దశాబ్దకాలం తర్వాత ఐటీ పార్క్‌ పునర్వైభవం పొందుతోంది. రాజధాని యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు లభించబోతున్నాయి.
 
               ఏపీఎన్‌టీఆర్‌టీ సొసైటీ కింద విదేశీ, స్వదేశీ భారీ ఐటీ కంపెనీల కన్సార్టియం ‘మేధ’కు తరలివచ్చింది. గ్రూప్‌ ఆంటోలిన, ఐఈఎస్‌, రోటోమేకర్‌, మెస్లోవా, చందు సాఫ్ట్‌, ఈపీ సాఫ్ట్‌ యామహ్‌ ఐటీ సొల్యూషన్స వంటివి ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీల ద్వారా కొద్దిరోజుల్లోనే ఈప్రాంత యువతకు 1,600 కొలువులు లభించనున్నాయి. జర్మనీ, యూఎ్‌సఏలకు చెందిన ఐటీ కంపెనీలతో పాటు స్వదేశంలోని పేరెన్నిక కలిగిన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి.
 
             దాదాపుగా 42,501 చదరపు అడుగుల స్థలంలో ఏడు కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. పది సంవత్సరాల కిందట కేసరపల్లి భూముల్లో ఐటీ సెజ్‌ కింద ‘ఎల్‌అండ్‌టీ-ఏపీఐఐసీ’ భాగస్వామ్యంతో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా మొదటి దశలో ‘మేధ’ టవర్‌ను నిర్మించారు. ఇలా మొత్తం నాలుగు టవర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఐటీ కంపెనీల కోసం ప్రత్యేకంగా రిక్రియేషన కేంద్రాలు, గేమింగ్‌ జోన, స్విమ్మింగ్‌ పూల్‌, భోజనశాల వంటివెన్నో ఇక్కడ ఏర్పాటు కావాల్సి ఉంది. మేధ పార్కులో మొదటగా నాలుగు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఆ తర్వాత కొత్తగా ఒక్కటి కూడా రాలేదు.
 
 
         ఐటీ కంపెనీలు రాకపోవటం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా కలగలేదు. మేధ టవర్‌లోనే 90 శాతం పైగా వేకెన్సీ ఉండటంతో ఆ తర్వాత మిగిలిన టవర్‌ల నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ అంతగా ఆసక్తి చూపలేదు. నూతన ప్రభుత్వం గత ఆరు నెలలకాలంలో ఐటీకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో పలు ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. విజయవాడలో ప్రధానంగా ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, కేసరపల్లిలోని మేధ పార్కులో ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీగా పలు ఐటీ కంపెనీల కన్సార్టియం అడుగు పెట్టబోతోంది.


   అమరావతిలో నేడే ఐటీ జోష్‌!