ఐపీఎల్‌లో రెండో సెంచరీ: చెలరేగిన ఆమ్లా, ముంబై టార్గెట్ 199

Header Banner

ఐపీఎల్‌లో రెండో సెంచరీ: చెలరేగిన ఆమ్లా, ముంబై టార్గెట్ 199

  Thu Apr 20, 2017 22:43        Sports, Telugu

ఇండోర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విశ్వరూపం ప్రదర్శించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ఆటగాళ్లు ఉగ్రరూపం దాల్చారు. పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా(60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 6 ఫోర్లు) సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు కోల్పోయి పంజాబ్‌ 198 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు ఆమ్లా, షాన్‌మార్ష్‌ (26: 21 బంతుల్లో 5×4) మంచి శుభారంభం అందించారు. వికెట్లను కాపాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో షాన్ మార్ష్(26) తొలి వికెట్ గా అవుట్ కావడంతో కింగ్స్ స్కోరు బోర్డు మరీ నెమ్మదించింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా(11) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్స్‌వెల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మెక్లనగన్‌ వేసిన 15వ ఓవర్‌లో ఏకంగా 6,6,4,4,6 బాది ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో ఆమ్లా చెలరేగాడు. మలింగ వేసిన రెండో బంతిని స్టేడియం బయటకు పంపిన ఆమ్లా.. ఆ ఓవర్‌లో 22 పరుగులురాబట్టాడు. చివరికి బుమ్రా బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ ఔటవడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోనిస్(1) అవుటైనప్పటికీ ఆమ్లా తన జోరు తగ్గించలేదు. ఇక చివరి ఓవర్ లో ఆమ్లా రెండు సిక్సర్లు సాధించడంతో కింగ్స్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గన్‌కు రెండు వికెట్లు లభించగా, కృనాల్ పాండ్యా, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. పంజాబ్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ వరుసగా 30 ఐపీఎల్‌ మ్యాచ్‌ల తర్వాత తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు తలపడిన 18 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి సమంగా ఉన్నాయి. ఇక ఈ సీజన్‌ని విజయంతో ఆరంభించిన పంజాబ్ ఆ తర్వాత ఆశించిన స్ధాయిలో రాణించలేకపోతోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ మాత్రం ఐదో స్థానంలో కొనసాగుతోంది

   2nd-century-in-ipl