రోజా చర్యతో లోలోన రగిలిపోతున్న టీడీపీ నేతలు

Header Banner

రోజా చర్యతో లోలోన రగిలిపోతున్న టీడీపీ నేతలు

  Wed Apr 19, 2017 21:54        అమరావతి కబుర్లు, India, Telugu

వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే టీడీపీ నేతలకు ఎంత కోపమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అసెంబ్లీలో ఆమె గొంతు వినేందుకు కూడా టీడీపీ నాయకత్వం ఇష్టపడడం లేదు.  అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. రోజాపై అటాక్ చేసేందుకు టీడీపీలో ఒక ప్రత్యేక బృందం కూడా ఉందని చెబుతుంటారు. ఈనేపథ్యంలో తాజాగా టీడీపీ నేతలు మరింత రగిలిపోయే పనిచేశారు రోజా.  చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తిరుగబడడం వెనుక పరోక్షంగా రోజా హస్తముందన్న నిర్ధారణకు టీడీపీ నేతలు వచ్చారు.

నిజానికి శివప్రసాద్, రోజా తండ్రి ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఆ స్నేహం కారణంగానే రోజాను చిత్రపరిశ్రమకు శివప్రసాద్‌ పరిచయం చేశారు. శివప్రసాద్‌ను తండ్రితో సమానంగా రోజా భావిస్తుంటారు. అయితే ఇటీవల శివప్రసాద్‌ వెనుక టీడీపీ నాయకత్వం గోతులు తవ్వడం ప్రారంభించిందని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో శివప్రసాద్‌కు టికెట్‌ ఎగొట్టేందుకు టీడీపీ నాయకత్వం నిర్ణయించుకుంది. ఎస్వీ యూనివర్శిటీ వీసీ ఆవుల దామోదరంకు చిత్తూరు ఎంపీ టికెట్‌ను చంద్రబాబు దాదాపు ఖాయం చేశారు. దీంతో కొంతకాలంగా శివప్రసాద్‌ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యే రోజా శివప్రసాద్‌తో చర్చలు జరిపారు. అనంతరం జగన్‌కు కూడా శివప్రసాద్‌ పరిస్థితిని రోజా వివరించారు.  మీరు ఓకే అంటే శివప్రసాద్‌ వైసీపీలోకి వస్తారని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

జగన్‌ నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావడంతో వెంటనే ఆ విషయాన్ని శివప్రసాద్‌కు రోజా చేరవేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్‌పై హామీ రావడంతోనే శివప్రసాద్‌ ధైర్యంగా జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సామాన్య కిరణ్‌ను ఇప్పటికే సంతనూతలపాడు నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా నియమించారు.

ఈ నేపథ్యంలో చిత్తూరు లోక్‌సభకు వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్‌ పేరు దాదాపు ఖరారైపోయింది. ఏడాదిగా శివప్రసాద్‌కు చంద్రబాబు ఏమాత్రం మర్యాద ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎస్వీ యూనివర్శిటీ వీసీ ఆవుల దామోదరానికి టికెట్‌ అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధవడమే అందుకు కారణమని చెబుతున్నారు. శివప్రసాద్‌కు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడికీ వెళ్లలేరన్న ధైర్యంతో చంద్రబాబు ఆయన్ను నిర్లక్ష్యం చేశారు. కానీ శివప్రసాద్‌ ఒక్కసారిగా తిరగబడడంతో టీడీపీ నాయకత్వం అవాక్కయింది.

ఇంత ధైర్యం శివప్రసాద్‌కు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసిన టీడీపీ నాయకత్వం.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో రోజా చక్రం తిప్పినట్టు గ్రహించింది. దీంతో టీడీపీ నాయకత్వం రోజాపై మరోసారి రగిలిపోతోంది. అయితే ఇప్పటికే రోజాను అన్నివిధాలుగా ఇబ్బందిపెట్టిన టీడీపీ నాయకత్వం ఇక ఏమీ చేయలేక మౌనంగా ఉంటోందని చెబుతున్నారు.  ఒక విధంగా రోజా టీడీపీపై ప్రతీకారం తీర్చుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది.


   రోజా చర్యతో లోలోన రగిలిపోతున్న టీడీపీ నేతలు