మతిలేని వ్యాఖ్యలు: పొలార్డ్‌కు ముత్తయ్య మద్దతు, మంజ్రేకర్‌పై మండిపాటు

Header Banner

మతిలేని వ్యాఖ్యలు: పొలార్డ్‌కు ముత్తయ్య మద్దతు, మంజ్రేకర్‌పై మండిపాటు

  Tue Apr 11, 2017 21:18        Sports, Telugu

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఆటను తప్పుబడుతూ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు. ఒక ఆటగాడిని బహిరంగంగా తప్పుబట్టడం సరికాదంటూ పొలార్డ్‌కు ముత్తయ్య మద్దతుగా నిలిచాడు.

ఐపీఎల్‌లో తెరపైకి ఓ వివాదం: మతిలేనివాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యలు

ఓ జాతీయ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పొలార్డ్ టాప్ ఆర్డర్‌లో ఫిట్ కాలేడంటూ మంజ్రేకర్ ఎలా నిర్ణయిస్తాడని ముత్తయ్య ప్రశ్నించాడు. టీ20 క్రికెట్‌లో పొలార్డ్ ఏడువేలకు పైగా పరుగులు సాధించాడని గుర్తు చేశాడు. పదేళ్ల క్రికెట్ అనుభవం ఉన్న పొలార్డ్‌ను పరిమిత ఓవర్ల ఆటగాడని మంజ్రేకర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని ముత్తయ్య అభిప్రాయపడ్డాడు.

'మంజ్రేకర్-పొలార్డ్‌ల వ్యవహారం కేవలం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదు. ఈ వివాదం చెలరేగడంలో ఇద్దరి పాత్ర ఉంది. టాప్ ఆర్డర్‌లో పొలార్డ్ పనికి రాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది. అలా చేయడం కచ్చితంగా ఒక ఆటగాడ్ని విమర్శించడమే. అందులోనూ బహిరంగంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది' అని ముత్తయ్య అన్నాడు.

'టీ20ల్లో ఏడు వేలకు పైగా చేసిన ఆటగాడిని టాపార్డర్ ఫిట్ కాలేడని మంజ్రేకర్ ఎలా అన్నాడు. అతను టాప్ ఆర్డర్‌లో సెట్ కాకపోతే అన్ని పరుగులు ఎలా చేస్తాడు. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా బాధించేవిగా ఉన్నాయి. ఆ క్రమంలోనే మంజ్రేకర్‌పై పొలార్డ్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు' అని అన్నాడు.

ఆదివారం రాత్రి వాంఖడె స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఆటతీరుపై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) కోల్‌కతా స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న సంజయ్ మంజ్రేకర్ 'మైదానంలో పొలార్డ్ మతిలేకుండా ఆడుతున్నాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు.

చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాండ్యా 29, నితీశ్ రానా 50 పరుగులతో రాణించడంతో ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ ట్విట్టర్ వేదికగా సంజయ్ మంజ్రేకర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డాడు. 'మతిలేనివాడని అంటావా.. ఒకసారి నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోలేం. నీ నోటి దురుసు తగ్గించుకుంటే బాగుంటుంది' అంటూ పోలార్డ్ హెచ్చరించాడు.


   polardku-muthaya-madathu