శ్రీ హేవిళంబి నామ సంవత్సర యుగాది విశిష్టం, వివిధ విశేషాలకు నాంది - కువైట్ ఎన్నారైస్ శుభాకాంక్షలు

Header Banner

శ్రీ హేవిళంబి నామ సంవత్సర యుగాది విశిష్టం, వివిధ విశేషాలకు నాంది - కువైట్ ఎన్నారైస్ శుభాకాంక్షలు

  Wed Mar 29, 2017 01:44        Devotional, Exclusives, Telugu, Kuwait

యుగాది, తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. యుగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారి  నూతన సంవత్సరం.  యుగాది రోజున క్రొత్తగా పనులు ప్రారంభించడం  పరిపాటి. ఉదయాన లేచి తలంటు స్నానం చేసి, క్రొత్త బట్టలు ధరించి, షడ్రుచుల యుగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవాలయములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. కవి సమ్మేళనం:

ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యంఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది

యుగాది కవి సమ్మేళనం. ఊరగాయల కాలం:

మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”

 

మావికొమ్మలు..

రేమ్మలమతునుంచి తొంగిచూసేవగరు రుచులు మామిడిపిందెలు

మావిచిగురు రుచిమరిగిన

కోయిల మధురమయిన

వసంతగానపు స్వరలహరి

జీవిత ఆనందాల వెలుగు అంచున

కష్టాల నీడల క్రీడా పుల్లని పలకరింపు

రుచుల - షడ్రుచుల

బ్రతుకు సంగమం యుగాది పచ్చడి

క్రిష్ణతత్వం మమేకమయిన

వసంతఋతువు సంతకంవాడిన మార్గశ్రా, ఫాల్గుణ మాసానికి

పచ్చని వడ్డాణం చైత్రమాసం

యుగాదికి ఆది

ఈ యుగాది

సర్వకష్టసుఖాల రుచుల

సమ్మేళన సంవత్సరాది

శ్రీ హేవిళంబి సంవత్సర యుగాది.

 

కువైట్ ఎన్నారైస్ పాఠకులకి శ్రీ హేవిళంబి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.


   యుగాది, శ్రీ హేవిళంబి సంవత్సర యుగాది, యుగాది శుభాకాంక్షలు, ఆవకాయ