'ప్రేమ తాండవం'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'ప్రేమ తాండవం'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Tue Mar 21, 2017 11:00        Rachanalu (రచనలు), Telugu

నీ లోపల అణువణువున..నిత్యప్రేమ తాండవమే..!

నీ తియ్యని తలపులతో..స్నేహప్రేమ తాండవమే..!

 

వెతుకుతున్న తీగేదో..మెరుపులాగ తగిలిందే..

నిన్ను నీవు కూడియాడ..సత్యప్రేమ తాండవమే..!

 

వెంటపడే జన్మకథల..చిత్రాలకు మాటలేల..

అలుకలన్ని తీర్చిచూప..మౌనప్రేమ తాండవమే..!

 

కన్నులింటి వాకిలిలో..పలు ముగ్గుల కావ్యాలే..

కదలాడని చూపులలో..దివ్యప్రేమ తాండవమే..!

 

పరిమళించు ఊహలన్ని..వర్షించే పూవులు కద..

ఇంద్రధనువు ఊయలలో..మధురప్రేమ తాండవమే..!

 

మనసుకన్న నులివెచ్చని..చెలి ఉండదు మాధవుడా..

అక్షరాల వెన్నెలలో..అమృతప్రేమ తాండవమే..!

 

- మాధవరావు కొరుప్రోలు


   జన్మకథ,తాండవం,వాకిలి,ఇంద్రధనువు,నులివెచ్చని