ట్విటర్ ఖాతాలు హ్యాక్... స్వస్తిక్ గుర్తులతో మెసేజ్‌లు

Header Banner

ట్విటర్ ఖాతాలు హ్యాక్... స్వస్తిక్ గుర్తులతో మెసేజ్‌లు

  Wed Mar 15, 2017 21:26        India, Social Network Hal Chal, Telugu

వందలాది ట్విటర్ ఖాతాలు బుధవారం హ్యాక్ అయ్యాయని ట్విటర్ యాజమాన్యం ధ్రువీకరించింది. నాజీ జర్మనీ, నాజీ హాలండ్‌లపై విరుచుకుపడుతూ టర్కీ అనుకూల హ్యాకర్లు అనేక ఖాతాలకు మెసేజ్‌లు పెట్టారని తెలిపింది. హ్యాక్ అయిన వాటిలో ఫ్రెంచ్ మినిస్ట్రీ, బీబీసీ నార్త్ అమెరికా, జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ వంటివాటి ఖాతాలు ఉన్నాయని పేర్కొంది.
 
‘‘#నాజీ జర్మనీ, #నాజీ హాలండ్. మీకు ఇదొక చిన్న #ఒట్టోమన్ దెబ్బ. #ఏప్రిల్ 16న కలుద్దాం.నేనేం రాశాను? టర్కిష్ నేర్చుకోండి’’ అని మెస్సేజ్‌లతో పాటు స్వస్తిక్ గుర్తులను కూడా ఈ ఖాతాల్లో పెట్టారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రసంగాల నుంచి కొన్ని భాగాల వీడియోలను కూడా పోస్ట్ చేశారు. యూరోపియన్ గడ్డపై టర్కీ ప్రభుత్వం ర్యాలీలు నిర్వహిస్తుండటంతో యూరోపు, టర్కీ మధ్య వివాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్ జరిగింది.
 
హ్యాకింగ్ జరిగినట్లు ట్విటర్ ధ్రువీకరించింది. ‘‘ఈ ఉదయం కొందరు ఖాతాదారులను ప్రభావితం చేసే సమస్యను మేం తెలుసుకున్నాం’’ అని ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పారు. దీనికి పాల్పడిన థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను గుర్తించామని, దానికి అనుమతులను తొలగించామని పేర్కొన్నారు. ట్విటర్ స్టాటిస్టిక్స్‌ను పర్యవేక్షించే ట్విటర్ కౌంటర్ అనే అప్లికేషన్‌ హ్యాక్ అయినట్లు, దాని ద్వారా ట్విటర్‌ ఖాతాల్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. సీఈఓ ఒమెర్ గినర్ మాట్లాడుతూ హ్యాకింగ్‌ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


   ట్విటర్ ఖాతాలు హ్యాక్... స్వస్తిక్ గుర్తులతో మెసేజ్‌లు