డిజిటల్ ప్రపంచంలో హిట్ కాయిన్ ఈ బిట్ కాయిన్

Header Banner

డిజిటల్ ప్రపంచంలో హిట్ కాయిన్ ఈ బిట్ కాయిన్

  Sat Mar 11, 2017 14:39        Business, Telugu, World

బిట్‌కాయిన్‌ అంటే... డిజిటల్‌ కరెన్సీ. ఆన్‌లైన్లో కొని, ఆన్‌లైన్లో మాత్రమే వాడుకోగలిగే కరెన్సీ. డాలర్, యూరో, మన రూపాయి వంటి కరెన్సీల్లా దీన్నెవరూ ముద్రించరు. ఫెడరల్‌ బ్యాంకుల మాదిరిగా దీనిపై ఎవరి నియంత్రణా ఉండదు కూడా. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌లో శక్తిమంతమైన కంప్యూటర్లు, సర్వర్లను ఉపయోగించి దీన్ని సృష్టించే వ్యక్తుల్ని మైనర్స్‌గా పిలుస్తుంటారు. ఈ మైనింగ్‌ టీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. ఈ నెట్‌వర్కే బిట్‌కాయిన్‌ లావాదేవీల్ని పారదర్శక పద్ధతిలో బ్లాక్‌చెయిన్‌ ద్వారా నమోదు చేస్తుంది. అంటే! బిట్‌కాయిన్లకు తమ సొంత పేమెంట్‌ గేట్‌వే ఉందన్నమాట. అదీ కథ.

బిట్‌కాయిన్లను జపాన్‌కు చెందిన సతోషి నకమొతో 2008లో సృష్టించారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు డిజిటల్‌ రూపంలో మార్చుకునే కరెన్సీగా... ఏ నియంత్రణా లేని కరెన్సీగా ఇది చలామణిలోకి వచ్చింది. కాకపోతే దీన్ని ఆన్‌లైన్‌ సైట్లు, ఇతర వ్యాపారులు తీసుకోవటం 2009 నుంచీ మొదలయింది. దీంతో బిట్‌కాయిన్ల ధర ఒకదశలో అమాంతం ఎగసింది. మళ్లీ పడింది. దాదాపు అంతర్జాతీయ వ్యాపారులంతా దీన్నిపుడు అంగీకరిస్తుండటంతో ధర బాగా పెరుగుతోంది. బిట్‌కాయిన్ల ధర బాగా పెరగటానికి మరో కారణం కూడా ఉంది. ఎంత మైనర్లయినా... ఎంత శక్తిమంతమైన కంప్యూటర్లయినా ఈ బిట్‌కాయిన్లను 2.1 కోట్లకు మించి సృష్టించలేవు.

అంటే ఏ దశలోనైనా 2.1 కోట్లకన్నా ఎక్కువ బిట్‌కాయిన్లుండే చాన్సు లేదన్నమాట. కాకపోతే వీటిని ముక్కలు చెయ్యటం మాత్రం వీలవుతుంది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ను అత్యంత తక్కువ డినామినేషన్లో... 10కోట్లవ వంతుకు విడగొడుతున్నారు. దీన్ని ‘సతోషి’గా పిలుస్తున్నారు. అంటే... 10 కోట్ల సతోషిలు కలిస్తే ఒక బిట్‌కాయిన్‌ అన్నమాట. దీనర్థం ఒక్కటే... కోట్ల కోట్ల సతోషిలు అందుబాటులోకి రావచ్చు. చిల్లర సమస్య కూడా ఉండదు. కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతుందన్నది కాదనలేని నిజం.

బిట్‌కాయిన్లను వ్యక్తుల నుంచిగానీ, ఎక్సే్ఛంజీల నుంచిగానీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే వీటిని కొనే ముందు వాలెట్‌ కొనుక్కోవాలి. వాలెట్లను మీ కంప్యూటర్లో, ఆన్‌లైన్లో, లేదా హార్డ్‌ వేర్‌ రూపంలో అందించే వాల్ట్‌ రూపంలో ఉంచుకోవచ్చు. తరువాత కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు చాలా సంస్థలు, ఎక్సే్ఛంజీ లున్నా... బిట్‌స్టాంప్, క్రాకెన్‌ (అమెరికా), బిట్‌ఫినెక్స్‌ (హాంకాంగ్‌), ఓకే కాయిన్, బీటీసీసీ (చైనా), బీటీసీఎక్స్, కాయిన్‌ సెక్యూర్‌ (ఇం డియా) వంటివి ఆయా దేశాల్లో ప్రధానమైనవి. కాకపోతే ప్రతి ఎక్సే్ఛంజీ ఇపుడు ఆయా దేశాల్లోని నిబంధనల మేరకు వ్యక్తుల పాన్‌ వంటి వివరాలడుగుతోంది. ఇక కాయిన్‌బేస్, సర్కిల్‌ వంటి వాలెట్‌ సంస్థలు కూడా వాలెట్‌ సేవలతో పాటు ఎక్సే్ఛంజీల మాదిరి కొనుగోలు, అమ్మకం సేవలందిస్తున్నాయి. చాలా దేశాల్లో వీటిని క్రెడిట్, డెబిట్‌ కార్డులు... మనీ ఆర్డర్లు ఉపయోగించి కొనుగోలు చేసే వీలుంది. విశేషమేంటంటే మీ వాలెట్‌ డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది కనక ఎప్పటికప్పుడు మారే బిట్‌కాయిన్‌ విలువ మీ వాలెట్లోనూ కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మీ బిట్‌కాయిన్ల విలువ కూడా మారుతుంది.

బిట్‌కాయిన్లను ఒకరికొకరు పంపించుకోవచ్చు. మరి ఎవరో ఒకరు రికార్డులు నిర్వహించాలి కదా? నిర్ణీత సమయానికి జరిగిన రికార్డులన్నిటినీ తమ కంప్యూటర్ల సాయంతో ఎవరో ఒకరు నిర్వహిస్తారు. దాన్ని బ్లాక్‌గా వ్యవహరిస్తారు. సదరు బ్లాక్‌లతో బ్లాక్‌ చెయిన్‌ ఏర్పడుతుంది. అది ఆ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవతుంది. కానీ కొత్త లావాదేవీలు నమోదయ్యే కొద్దీ ఇది మరింత పెరుగుతుంది. దాన్నంతటినీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల సాయంతో యాష్‌లు, ఇతర సాంకేతిక పదాలుపయోగించి సురక్షితం చేస్తారు. ఇలా బ్లాక్‌చెయిన్‌ అప్‌డేట్‌ చేసిన మైనర్లకు నజరానాగా 25 బిట్‌ కాయిన్లు దక్కుతాయి. అది అందరికీ తెలుస్తుంది కూడా. కాకపోతే లావాదేవీలు పెరిగేకొద్దీ... ఇది మరింత సంక్లిష్టంగా మారుతుంటుంది.

ఇక బిట్‌కాయిన్‌ మైనింగ్‌కు ఉపయోగించే హార్డ్‌వేర్‌ కూడా తేలికదేమీ కాదు. సెకనుకు ఎన్ని ఎక్కువ హ్యాష్‌లు జనరేట్‌ చేసే ప్రాసెసర్‌ అయితే కాయిన్లు పొందేందుకు అన్ని అవకాశాలుంటాయన్న మాట. మామూలు సిస్టమ్‌లు సెకనుకు 10మెగా హ్యాష్‌లు జనరేట్‌ చేసేవైతే... మైనర్లు వాడేవి సెకనుకు 1టెరా హ్యాష్‌లు జనరేట్‌ చేసే శక్తి కలిగి ఉంటాయి. ఇక వీటికయ్యే విద్యుత్‌ ఖర్చులూ ఎక్కువే. ఇవి కాక ఇంకొన్ని పరికరాలూ ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించటం ద్వారా మైనర్ల టీమ్‌లో చేరొచ్చు.

ఇప్పుడు కాయిన్‌బేస్‌ వంటి వాలెట్లు తమ వాలెట్లోని బిట్‌కాయిన్లతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. బంగారం బిస్కెట్లను ఆర్డర్‌ చేస్తే డెలివరీ చేస్తున్నాయి కూడా. ఇక డెల్‌ వంటి సంస్థలతో పాటు విదేశాల్లోని పలు ఎయిర్‌లైన్‌ సంస్థలు కూడా బిట్‌కాయిన్లను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. అమెజాన్‌ వంటి సైట్లలో షాపింగ్‌కు వినియోగించే గిఫ్ట్‌ కార్డులనూ వీటితో కొనొచ్చు. ఇపుడిప్పుడే చాలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ సంస్థలు వీటిని అంగీకరిస్తున్నాయి. కాకపోతే ప్రతి లావాదేవీనీ మైనర్లు ధ్రువీకరిస్తుంటారు. తరువాత బ్లాక్‌చెయిన్‌ ఏర్పడుతుంది. దీనికి 10 నిమిషాల వరకూ సమయం పట్టొచ్చు. ఒక బిట్‌కాయిన్‌ను 10కోట్ల సతోషిలుగా విడగొట్టే అవకాశముంది కనక ఏ ధరతోనైనా లావాదేవీ చేసుకోవచ్చు. 


   bitcoin, mining, coin base wallets, bit coin mining software, what is bit coin