పర్యటనకు హిమా'ఛల్‌'

Header Banner

పర్యటనకు హిమా'ఛల్‌'

  Fri Mar 10, 2017 21:23        Telugu, Travel

హిమాచల్‌ప్రదేశ్‌లోని నరకందను చేరుకునే పర్యాటకులు ఇక్కడున్న ప్రదేశాలలో ప్రధానంగా చూడవలసింది హాటు శిఖరం. నరకంద పట్టణంలోనే ఇది చెప్పుకోదగ్గ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 3,300 మీటర్ల ఎత్తులో పట్టణంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంగా ఇది పేరు పొందింది. ఈ శిఖరం హిమాలయ శ్రేణి, దాని మంచు పర్వతాలు, దట్టమైన దేవదారు అడవులు, ఆపిల్‌ తోటలు, ఆకుపచ్చని వరిపొలాల విహంగ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. నరకంద నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరం చేరడానికి హైకింగ్‌ ఏకైక మార్గం. శిఖరం మీద సందర్శకులు విశ్రాంతి పొంది, సేద తీరేందుకు ప్రభుత్వ అతిథి గృహం ఏర్పాటు చేశారు. ఇది అందమైన చెరువును ఆనుకుని ఉంటుంది. 

కొత్గడ్‌, తానేదవార్‌

నరకంద నుంచి 17 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 1830 మీటర్ల ఎత్తులో కొత్గడ్‌, తానేదవార్‌ ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలూ హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు. సట్లెజ్‌ నది ఎడమవైపు తీరంలో ఉన్న కొత్గడ్‌, గుర్రపు డెక్క ఆకారపు పురాతన లోయగా ప్రసిద్ధి. తానేదార్‌ ఆపిల్‌ తోటలకు పేరు పొందింది. ఈ రెండు ప్రదేశాలనూ భారీ ఆపిల్‌ తోటలు, పండ్లతోటల వల్ల నరకందలోని అత్యంత పచ్చని లోయలుగా పేర్కొంటారు. ప్రసిద్ధ రచయిత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ తన లిస్పెత్‌ అనే కథానికలో కొత్గడ్‌ను 'ఉత్తర కొండల దొరసాని'గా అభివర్ణించాడు. సందర్శకులు కొత్గడ్‌లోయ నుంచి కులు లోయ, హిమాలయాల మంచుపర్వతాల అద్భుతమైన దృశ్యాలను చూడొచ్చు. 

ట్రెక్కింగ్‌

ట్రెక్కింగ్‌ నరకందలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస క్రీడలలో ఒకటి. శిఖరం, నరకందను చక్కగా అనుసంధానించే ట్రెక్కింగ్‌ మార్గం ఉంది. ఈ మార్గంలో సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. సాహసాలను ఆస్వాదించే వారికి ఈ క్రీడ ఎంతగానో ఆహ్లాదపరుస్తుంది. ట్రెక్కింగ్‌ మార్గాల చుట్టూ ఉన్న దేవదారు, సింధూర, ఫర్‌, పైన్‌, రోడోడెండ్రాన్‌, సిల్‌ చెట్లతో కూడిన అడవులు సహజ దృశ్యాల మాలిక. యాత్రీకులు ప్రకృతి మధ్య నెలకొని ఉన్న జో బాగ్‌ పచ్చికబయళ్ళపై శిబిర నివాసం ఏర్పాటు చేసుకుని, ఎంచక్కా సేదతీరవచ్చు.

 


   Himachalpradesh-for-travel