కంటిచూపును మింగేసే గ్ల‌కోమా

Header Banner

కంటిచూపును మింగేసే గ్ల‌కోమా

  Mon Mar 06, 2017 22:43        Science, Telugu

  బెడ్‌రూమ్‌ నుంచి హాల్లోకి నడుస్తూ పక్కనే ఉన్న గోడని ఢీకొంది 44ఏళ్ల సులక్షణ. 'ఏంటీ! ఈ గోడ ఎందుకు కన్పించలేదు' అని తనలో తానే అనుకుంది. 'సరిగా చూసి నడవాలి కదా!' అంటూ వేళాకోళం చేసాడామె భర్త. కానీ ఆమె ఆలోచనలో పడింది ఏమైందా అని.
-----------------------------------
45 ఏళ్ల నవీన్‌ మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఇంటికి దగ్గరే కదా అని రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలోనే ఎదో రాసుకుని వెళ్లినట్లన్పించి 'అబ్బా!' అంటూ ఒక్కసారిగా కిందపడ్డాడు. ఏమయిందో, తనెందుకు ఇలా పడిపోయాడో అర్థంకాక అయోమయంగా చూస్తున్నాడు. 'ఏమయ్యా! పక్క నుంచి బండి వస్తుంటే తప్పుకోవేం...కళ్లు సరిగా కన్పించడం లేదా...!' అని మందలించాడొకాయన. తన పక్క నుంచి బండి ఎప్పుడెళ్లింది. అనుకుంటూ నవీన్‌ మరింత అయోమయానికి గురయ్యాడు.
-------------------------------
సులక్షణ, నవీన్‌ ఇలా ఈ ఇద్దరే కాదు. చాలా మందికి ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ అనుభవంలోకి వస్తుంటాయి. అయితే ఏదో పరధ్యానంలో చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకపోవడం వేరు.
కానీ వీళ్ల విషయంలో కారణం వేరు. ఇద్దరికీ నిజంగానే కంటి సమస్య ఉంది. అదేమిటంటే మెల్లమెల్లగా పక్కచూపును హరించే మహమ్మారి నీటికాసుల వ్యాధి.
దీన్నే 'గ్లకోమా' అంటారు.
గ్లకోమా వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలేమిటి? ఎలాంటి పరీక్షలు, ఎలాంటి చికిత్సలతో దీనిని నివారించాలో ఆ విశేషాలు ఈ వారం 'డాక్టర్‌ స్పెషలిస్ట్‌'లో ....

శరీరంలో అతి ముఖ్యమైన సున్నితమైన భాగం కన్ను. అది మెదడులోని ప్రత్యేక ఇంద్రియాల సహకారంతో వివిధ రూపాలను చూడటం, వివిధ చర్యలను నిర్వహిస్తుంది. కంటి ముందున్న కాంతి మూలకాల ద్వారా సంకేతాలు కంటిని చేరతాయి. కంటి వెనుక భాగంలో గల సున్నితమైన పొర, రెటీనాపై ప్రతిబింబం ఏర్పడుతుంది కంటి నరాల ద్వారా ఈ ప్రతిబింబం మెదడును చేరుతుంది. కంటికి హాని కలిగితే దృష్టిలోపాలు ఏర్పడతాయి. వాటిలో ప్రధానమైనది 'గ్లకోమా'. ఇది కంటి నరాలకు సంబంధించిన వ్యాధి. కంటి నరాల్లో పీడనం పెరిగితే ఇది వస్తుంది. ఏదైనా ఒక వస్తువును చూస్తున్నప్పుడు తలను తిప్పకుండా ఆ వస్తువు చుట్టుపక్కల చూడగలిగే ప్రదేశాన్ని దృష్టి క్షేత్రం లేదా ఫీల్డ్‌ ఆఫ్‌ విజన్‌ అంటారు. గ్లకోమా ప్రారంభమైనపుడు పాక్షికంగా దృష్టిలోపం కలుగుతుంది. దానిని నిర్లక్ష్యం చేసి, సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నాళ్లకు పూర్తిగా కంటిచూపు పోతుంది.

ఎలా వస్తుంది?
కంటిని కూడా తడిగా ఉంచడానికి, అవసరమైన పోషకాలను ఇవ్వడానికి కంటిలోని సీలియా అనే భాగాల నుంచి నీరు నిరంతరం ఉత్పత్తి అవుతుంటుంది. దీన్నే ఆక్వియస్‌ హ్యూమర్‌ అంటారు. ఇది లెన్సును క్లియర్‌గా ఉంచడానికి, కంటికి పోషకాలు, ఆక్సిజన్‌ అందించడానికి ఉపయోగ పడుతుంది. ఇది కనుపాప మీదుగా ప్రయాణించి, బయటకు వచ్చి రక్తంలోకి వెళ్తుంది. ఈ ఆక్వియస్‌ హ్యూమర్‌ పీడనం నార్మల్‌గా 21 మి.మీ. మెర్క్యురీ ఉంటుంది. ఇంతకన్నా పీడనం ఎక్కువైతే సమస్య మొదలవుతుంది. ఈ పీడనం పెరగడం వల్ల దృష్టినాడి దెబ్బతిని చూపు తగ్గిపోతుంటుంది.

లక్షణాలు
ప్రారంభంలో గ్లకోమాకు ఎటువంటి భయపెట్టే లక్షణాలూ కనిపించవు. అందువల్ల దీనిని సైలెంట్‌ కిల్లర్‌గా అంటారు. ఈ వ్యాధికి మొట్టమొదటి లక్షణం పక్కచూపు మందగించడం. అయితే దీన్ని గుర్తించేసరికే వ్యాధి తీవ్రమైపోతుంది. కంటి నరాల్లో ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు హఠాత్తుగా కన్నునొప్పి, తలనొప్పి రావడం, చూపు మసకబారడం, కాంతి చుట్టూ వలయాలుగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కన్ను ఎర్రబారడం, వికారం, వాంతులు, దృష్టి చిన్నదైపోవడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి.

ఎవరికి వస్తుంది?
పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారికైనా గ్లకోమా రావచ్చు. కొందరి పిల్లల్లో ఇది పుట్టుకతోనే ఉంటుంది. అనువంశికంగా కూడా వస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు, ధూమపానం చేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదంలో కంటికి బలమైన గాయం తగిలిన వారికి, కార్నియా మధ్యభాగం ఐదు మి.మీ. కంటే తక్కువ దళసరి కలిగి ఉన్నవారికీ, సాధారణంగా నలబైయ్యేళ్లు దాటి, దృష్టి క్షేత్రంలో లోపాలున్నవారికి, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడేవారికి ఈ వ్యాధి వస్తుంది.

రకాలు
గ్లకోమాలో వాటి లక్షణాలను బట్టి చాలా రకాలున్నాయి.
- ఎలాంటి కారణం లేకుండా ఈ వ్యాధి ప్రారంభమైతే దాన్ని ప్రైమరీ గ్లకోమా అంటారు. ఈ తరహా కేసుల్లో నొప్పి, కన్ను ఎరబ్రారడంతో పాటు చూపును కాస్త వేగంగా కోల్పోతారు.
- కంటికి దెబ్బతగలడం, కంటిలోని కటకం దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లు వంటి కారణాల వల్ల వచ్చే గ్లకోమాను సెకండరీ గ్లకోమా అంటారు.
- ఒకేసారి రెండు కళ్లూ గ్లకోమాకు గురైతే దానిని బైలేటరల్‌ గ్లకోమా అంటారు. పుట్టుకతో, వయసులవారీగా వచ్చే ప్రైమరీ గ్లకోమాలన్నీ ఒకే సమయంలో రెండు కళ్ల మీద దాడి చేస్తాయి.
- చిన్న పిల్లల్లో వచ్చే గ్లకోమాను కంజెనిటల్‌ గ్లకోమా లేదా పీడియాట్రిక్‌ గ్లకోమా అంటారు. కొంతమందిలో పుట్టుకతోనే కంటిలో ఉండే యాక్వస్‌ ద్రవం బయటకు ప్రవహించదు. దాంతో కనుగుడ్డు మామూలు కంటే పెద్దదిగా ఉంటుంది. దీన్నే బూఫ్తాల్మస్‌ అంటారు. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. పిల్లలు కాంతిని చూడలేరు. ఈ పరిస్థితిని ఫొటోఫోబియా అంటారు.
- కంటిలోని నిర్మాణాలన్నీ బాగానే ఉన్నా కాని కంటిలోని నీరు ట్రాబెక్యులర్‌ మెష్‌వర్క్‌ ద్వారా సక్రమంగా బయటకు వెళ్లదు. దీనిలో యాంగిల్‌ నార్మల్‌గానే ఉన్నప్పటకి ఆక్వియస్‌ హ్యూమర్‌ ద్రవ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సీలియరీ బాడీ అవసరానికి మించి పనిచేసి, ఎక్కువ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తయ్యే నీరు, బయటికి వెళ్లిపోవాల్సిన నీరు నిష్పత్తి దెబ్బతింటుంది. తద్వారా నీరంతా కంటిలోనే మిగిలిపోతుంది. దాంతో పీడనం పెరుగుతుంది. దీన్నే ఆక్యులర్‌ ప్రెషర్‌ అంటారు. ఈ పీడనం పెరగడం వల్ల దృష్టి నాడిపై ఒత్తిడి పడి, అది క్రమంగా దెబ్బతింటుంది. ఇలాంటి గ్లకోమాను ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా అంటారు.
- మధుమేహం, రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌ వల్ల వచ్చే గ్లకోమాను నియో వాస్క్యులర్‌ గ్లకోమా అంటారు.
- కంటిలోని ఐరిస్‌, కార్నియాల మధ్య ఉండే యాంగిల్‌ కుంచించుకుపోవడం వల్ల కూడా గ్లకోమా వస్తుంది. ఐరిస్‌ దాదాపుగా ఈ మార్గాన్ని మూసివేస్తుంది. తద్వార కంటి నరాల్లో హఠాత్తుగా పీడనం పెరిగిపోతుంది. ఇలాంటి గ్లకోమాను యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా అంటారు.
- ఒక కన్ను మాత్రమే గ్లకోమాకు గురైతే, దానిని యూనిలేటరల్‌ గ్లకోమా అంటారు. కంటికి దెబ్బతగలటం, రక్తపోటు, స్టిరాయిడ్‌ల వాడకం వల్ల వచ్చే గ్లకోమా మొదట ఒక కంటితో మొదలౌతుంది.
- విపరీతమైన స్టెరాయిడ్ల వాడకంవల్ల ఆప్టిక్‌ నర్వ్‌ దెబ్బతింటే వచ్చే గ్లకోమాను స్టెరాయిడ్‌ ఇండ్యూసడ్‌ గ్లకోమా అంటారు.
- టీనేజర్లు మొదలుకుని 30,40 ఏళ్ల వయసువారికి వచ్చే గ్లకోమాను జువెనైల్‌ గ్లకోమా అంటారు
- నలభై యేళ్లు దాటిన వారికి వచ్చే గ్లకోమాను అడల్ట్‌ గ్లకోమా అంటారు.
- కొందరిలో కంటి నరాల్లో ద్రవ ప్రవాహం కూడా సక్రమంగానే జరుగుతూ ఉంటుంది. అయినా కంట్లో ఒత్తిడి పెరిగిఆప్టిక్‌ నర్వ్‌ దెబ్బతింటుంది. ఇలాంటి రుగ్మతను నార్మల్‌ టెన్షన్‌ గ్లకోమా అంటారు.

నిర్ధారణ
గ్లకోమా వ్యాధిని నిర్ధారించే పరీక్షలు కూడా రకరకాలుగా ఉంటాయి. సాధారణ కంటి పరీక్షలతో పాటుగా ఆక్యులర్‌ ప్రెజర్‌ పరీక్ష చేస్తారు. నిజానికి ఈ పరీక్ష పుట్టగానే చేయాలి. ఏ కంటి సమస్యతో వచ్చినా కంటి పీడనాన్ని కూడా పరీక్షించడం అవసరం. ఓపెన్‌ లేదా క్లోజ్డ్‌ యాంగిల్‌లో ఏ రకమైన గ్లకోమానో నిర్ధారించడం కోసం గోనియోస్కోపీ చేస్తారు. కంటిమీద గోనియో లెన్సును పెట్టి పరీక్షిస్తారు. కంటి నరాలు ఓపెన్‌గా ఉన్నాయా లేదా కుంచించుకుపోయి (క్లోజ్డ్‌) ఉన్నాయా అనేది ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కన్ను చూడగలిగే విజువల్‌ ఫీల్డ్‌ లేదా దృష్టి క్షేత్రానికి అడ్డుగా ఏదన్నా వస్తే దాన్ని ఫీల్డ్‌ డిఫెక్ట్‌ అంటారు. విజువల్‌ ఫీల్డ్‌ పరీక్ష ద్వారా ఫీల్డ్‌ డిఫెక్ట్‌ ఎంతవరకు ఉందో పరీక్షిస్తారు. ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి కుటుంబంలో ఒకరికి గ్లకోమా ఉన్నట్టు తేలితే ఆ కుటుంబ సభ్యులందరూ, అంటే పేషెంటు తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి పిల్లలు అందరూ ప్రతి ఏటా తప్పనిసరిగా గ్లకోమా పరీక్ష చేయించుకోవాలి.

చికిత్స
గ్లకోమాకు జీవితాంతం చుక్కల మందులు వాడాలి. కొన్నిరకాల గ్లకోమాలకు మాత్రమే లేజర్‌ చికిత్స ఉపయోగపడుతుంది. సాధారణ చికిత్సల వల్ల కంటిలోని ఒత్తిడి (ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌) నియంత్రణలోకి రాకపోతే శస్త్రచికిత్స చేస్తారు. కొన్నిసార్లు ఈ సర్జరీ ఫలితమివ్వక పోతే గ్లకోమా ఇంప్లాంట్స్‌ అమరుస్తారు.

* జాగ్రత్తలు
గ్లకోమాను నియంత్రించే అవకాశాలు లేకపోయినా కొన్ని జాగ్రత్తలు
తప్పనిసరిగా తీసుకోవాలి
- వంశపారంపర్యంగా గ్లకోమా వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులు క్రమం తప్పక వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకోవాలి.
- ఒక కంటిని మూసి ఉంచి రెండో కంటిచూపును పరీక్షించుకోవాలి. ఇలా రెండు కళ్లనూ స్వీయ పరీక్ష చేసుకుంటూ గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించే ప్రయత్నం చేయాలి.
- స్టెరాయిడ్స్‌ వాడకం వీలైనంత తగ్గించాలి.
- కళ్లను బాధించే చిన్న చిన్న రుగ్మతలకు వైద్యుల ప్రమేయం లేకుండా స్టెరాయిడ్‌ కలిగిన చుక్కల మందులు వాడేయకూడదు.
- మధుమేహులు చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవాలి.
- కళ్లకు దెబ్బలు తగలకుండా కాపాడుకోవాలి.
- టపాసులు కాల్చేటప్పుడు నిప్పు రవ్వలు కంట్లో పడకుండా చూసుకోవాలి. ఈ ప్రమాదాల వల్ల కూడా కళ్లల్లో గ్లకోమా రావొచ్చు.
- షటిల్‌ ఆడేటప్పుడు కాక్‌ కంటికి తగలటం, క్రికెట్‌ ఆడేటప్పుడు బాల్‌ బలంగా కంటిని తాకితే జరిగితే గ్లకోమా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి ఆటలాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
- రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌లను.. అదుపులో ఉండేలా చూసుకోవాలి.


   Glykoma-effects-eyes