'నా వరాల గాలిపటం..!!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'నా వరాల గాలిపటం..!!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Thu Jan 12, 2017 12:56        Rachanalu (రచనలు), Telugu

మౌనగగన వీధులలో..అక్షరాల గాలిపటం..!!
నీ చూపుల ప్రేమలేఖ..మధురవాల గాలిపటం..!!

పాడలేని నా మనసుకు..సరిగమలే నేర్పినావె..
నీ తలపుల ఇంద్రధనువె..నా వరాల గాలిపటం..!!

నన్ను నాకు అందించెను..కలలోలా..చిత్రంగా..
చైత్రవీణ..నీ వలపే..సరాగాల గాలిపటం..!!

ఆడుతున్న అందియలకు..సందడేల నింపేనో..
అణువణువున నర్తించే..కలరవాల గాలిపటం..!!

ముద్దులన్ని ముడుపుకట్టి..దాచిపెట్టె ముచ్చటగా..
గగనాలను దాటించే..సుస్వరాల గాలిపటం..!!

మాధవునకు గజల్ తోట చూపించెను..విహరించగ..
సరసభావ సంపదైన..మేఘమాల..గాలిపటం..!!

 

- మాధవరావు కొరుప్రోలు


   గాలిపటం,చైత్రవీణ,అణువణువు, ముడుపు,తోట,చూపు,అందియ,